నటి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆదివారం శస్త్ర చికిత్స జరిగింది. ఈ మేరకు రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని తెలిపిన ఆయన.. ఇందుకు సంబంధించి రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని.. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఆదివారం రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని, 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు. అయితే.. రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపారు. ఇదిలావుంటే.. రోజాకు ఇదివరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని.. కరోనా కారణంగా వాయిదాపడిందని తెలిపారు. దయచేసి ఎవరూ హాస్పిటల్ వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఎవరిని అనుమతించడం లేదని అన్నారు.