నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. మురుగు నీటి కాలువలోకి దిగి నిరసన చేపట్టారు. 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, దీని వల్ల వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోందని, ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని తెలిపారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. సమస్యను ఎప్పటి వరకు పరిష్కరిస్తారో లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని, అంత వరకు ఇక్కడి నుంచి కదలబోనని తెలిపారు. గడువులోపు సమస్య తీరకుంటే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. ఆయనకు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్పందించిన అధికారులు వచ్చేనెల 15 లోపు సమస్యను పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.