ప్రభుత్వం వేర్పాటు ధోరణి ప్రదర్శిస్తే.. తనలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ప్రతి ఒక్కరూ మా రాష్ట్రం మాకు కావాలంటే కుదరదు. వైసీపీనే కాదు.. ఏ పార్టీ నేత అయినా మళ్లీ వేర్పాటు వాదం గురించి మాట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తారా? రాజ్యాంగం గురించి అధికార వైసీపీ నేతలకు ఏమి తెలుసని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీసీ నాయకులు ఆధిపత్యధోరణి ప్రదర్శిస్తే తనంత తీవ్రవాది ఉండడని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీవ్రవాదిలా మారితే కుక్కను కాల్చినట్లు కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా అని ప్రశ్నించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే 3 ప్రాంతాల అభివృద్ధి విధానమని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని.. మాకు ఇప్పటికి 55 శాతం ఓటు బ్యాంక్ ఉందని అన్నారు. అందరూ కలిసి వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరని.. ఎవరెన్ని చేసినా బతికున్నంతా కాలం ఈ రాష్ట్రానికి జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు.