బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్‌లో శనివారం రాత్రి నటుడు నందమూరి తారకరత్న మరణించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జనవరి 27న ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పట్టణంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో కుప్పకూలిపోవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకుంటారని అందరూ ఆశించారు. కానీ ఆయన తుది శ్వాస విడిచారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.
ఆయన భౌతికకాయానికి పలువురు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. తారకరత్నతో ఆయనకు ఉన్న పరిచయాన్ని గురించి మాట్లాడారు. తారకరత్న అందరితో కలిసిపోయే మంచి వ్యక్తి అని.. తన తాత దివంగత ఎన్టీఆర్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన టీడీపీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేశాడని అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడి మనవడు అయినప్పటికీ, తారకరత్న తన ఇంటి పేరును పాపులారిటీ కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. సినీ పరిశ్రమ, రాజకీయాల్లో పేరును సంపాదించడానికి చాలా కష్టపడ్డాడని అన్నారు నాని. తారకరత్న అకాల మరణం చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.