బాబులో భగత్ సింగ్‌ను చూస్తున్నావా..? పవన్‌కు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్న
MLA Grandhi Srinivas Slams Pawan Kalyan. బాబులో భగత్ సింగ్ ను చూస్తున్నావా..? అంటూ పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూటి ప్రశ్న
By Medi Samrat Published on 1 July 2023 3:32 PM ISTబాబులో భగత్ సింగ్ ను చూస్తున్నావా..? అంటూ పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూటి ప్రశ్న సంధించారు. భీమవరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ భీమవరం సభ తుస్సుమంది అన్నారు. రెండ్రోజులు జ్వరమంటూ కళ్యాణమండపంలో విశ్రాంతి పేరుతో సినిమా డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత కొంతమందిని పిలిపించుకుని చిన్న మీటింగ్‌లు పెట్టుకుని.. జూన్ 30న సుదీర్ఘంగా ప్రసంగిస్తానని, ఏవేవో మొత్తం విప్పేస్తానంటూ ఆ మీటింగ్‌ల్లో చెప్పుకున్నాడన్నారు. దీంతో అందరూ పవన్‌కళ్యాణ్ ఏం విప్పేస్తాడో.. ఏం మాట్లాడుతాడోనని ఊరించి సస్పెన్స్ థ్రిల్లర్‌ని మరిపించాడు. అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తీరాచూస్తే నిన్న బహిరంగ సభలో ఆయన తుస్సుమనిపించాడు. కాస్తాకూస్తో సభకొచ్చిన పిల్లసైన్యం కూడా నీరుగారి వెనక్కుదిరిగి పోయారని ఎద్దేవా చేశారు.
జనసేన అంటే జనాన్ని మోసగించే పార్టీ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీపైనా, ముఖ్యమంత్రిపైనా ఎన్నెన్నో అబద్ధాలు అల్లి చెప్పాడు. యువకులు, శ్రామికులు, రైతులు అంటూ నోటికొచ్చినట్లు డైలాగులు డొర్లించి అర్ధంపర్ధంలేని వ్యాఖ్యలు చేశాడు. దీన్నిబట్టి చూస్తే జనసేన పార్టీ అంటే జనాన్ని మోసగించే పార్టీ అని.. జనాలకు అబద్ధాలు చెప్పే పార్టీ అని అందరికీ అర్ధమైందన్నారు. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని, జనసైనికుల్ని మోసం చేసే పార్టీగా నిన్న పవన్‌కళ్యాణ్ మాటల్ని బట్టి జనసేనను అందరూ అర్ధం చేసుకున్నారు. ఏతావాతా ఆయన ప్రసంగం మొత్తం వింటే.. పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తి నాయకుడు కాదు.. ఆయనొక ప్యాకేజీ స్టార్ మాత్రమేనని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకున్నారని అన్నారు.
ప్రతీసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని, ప్రభుత్వ పెద్దల్ని దుమ్మెత్తిపోయడం.. బూతుల పురాణంతో ఊగిపోతున్న పవన్‌కళ్యాణ్‌ను నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబులో మీరు చూస్తున్న రూపాలేంటి..? రైతుల్ని, మహిళల్ని, యువతను అన్నిరంగాల వారిని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు మీకు ఎలా కనిపిస్తున్నారు. ఒక గాంధీలాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక తరిమెల నాగిరెడ్డిలా కనిపిస్తున్నారా.. పవన్‌కళ్యాణ్..? బాబులో ఒక చే గువేరా.. ఒక పొట్టిశ్రీరాములుని చూసుకుంటున్నావా..? చంద్రబాబును ఒక భగత్‌సింగ్ అని చెప్పే దమ్ము పవన్‌కళ్యాణ్‌కు ఉందా..? ఆయనతో కలిసి ఎందుకు ప్రయాణిస్తున్నారు.. అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. లేదంటే, కనీసం జనసేన కేడర్‌కైనా మీరు సమాధానం ఇవ్వాలని పవన్‌ను డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ లు తోడు దొంగలని.. ఆ ఇద్దర్నీ జనం నమ్మరని అన్నారు.
సీఎం జగన్ చేయిచూపుతూ మాట్లాడుతారని పవన్‌కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడు.. ఆయన్ను ఇమిటేట్ చేసే అర్హత వంద జన్మలెత్తినా పవన్‌కళ్యాణ్‌కు రాదని అన్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ ఎగొట్టి మోసం చేసినప్పుడు.... ప్రశ్నిస్తానన్న నీ నోరు ఎందకు పడిపోయింది పవన్‌కళ్యాణ్..? అంటూ ప్రశ్నించారు. భీమవరంలో పవన్ మాట్లాడుతూ.. నామీద ఏవేవో అవాకులు చెవాకులు పేలాడు. సరే, భీమవరం నియోజకవర్గానికి మేం ఏం మేలు చేస్తున్నామనేది ఇక్కడ ప్రజలు నీకు చెబుతారు. మరి 2019కు ముందు అధికారంలో ఉన్న టీడీపీని ఏనాడూ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.