వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్.. చనిపోయిన 7 నెలల తర్వాత పరామర్శ పేరుతో శవ రాజకీయం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా.. ? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్డల మరణాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీ రాజకీయ లబ్ధి కోసం.. బాధిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతారా.. అని గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరసరావుపేటలో మీడియా సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, యువతులపై దురదృష్టవశాత్తూ అనుకోని ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు.. ప్రభుత్వం వేగంగా స్పందించి, దిశ చట్టం స్ఫూర్తితో నిందితులను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసి, విచారణ పూర్తి చేసి, న్యాయస్థానాల్లో నిలబెట్టడంతోపాటు, బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు, ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందన్నారు.
అదే టీడీపీ హయాంలో రిషితేశ్వరి కేసు నుంచి కాల్ మనీ సెక్స్ రాకెట్ వరకూ.. లెక్కలేనన్ని ఘటనలు జరిగితే.. ఏ ఒక్కరికైనా న్యాయం చేశారా.. అని గోపిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రేరేపిత చర్యలంటే.. మీ హయాంలో మీ పార్టీకే చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావును ఉసిగొల్పి తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయించడం, రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులవ్వడం.. పెందుర్తిలో మీ పార్టీ నేతలే ఓ దళిత మహిళను వివస్త్రను చేసి రోడ్డు మీద పడేయడం వంటి అనేక ఘటనలు జరిగాయి. అప్పుడు ఏ ఒక్క ఘటనలో అయినా మీరు స్పందించారా? అని ప్రశ్నించారు.