నా ఆస్తి మొత్తం ప్రజలకే: ఎమ్మెల్యే అనగాని

MLA Anagani said that he will spend all his wealth for the people. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు

By అంజి  Published on  10 July 2022 3:27 PM IST
నా ఆస్తి మొత్తం ప్రజలకే: ఎమ్మెల్యే అనగాని

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకున్న మొత్తం ఆస్తిని ప్రజల కోసం ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం పూడివాడి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. తనకు వారసులు లేరని.. ప్రజలే తన వారసులని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఆసరగా ఉంటానన్నారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా ముందుంటానని చెప్పారు.

రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతలు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని సత్యప్రసాద్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, తన ఆస్తులు అమ్మి అయినా సరే ప్రజలకు సేవ చేస్తానన్నారు. టీడీపీ ఫ్లెక్సీలను చించేయడం వైసీపీ నాయకుల దుర్మార్గానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే నష్టపోయిన టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేసేలా చూస్తామని చెప్పారు. తన బలం, బలహీనతలైన కార్యకర్తల కోసం.. తాను ఏం చేయడానికైనా ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Next Story