నలుగురు దొంగలను ప్రతిఘటించిన మహిళ
Miscreants enter house attack inmate at Pendurthi.అర్థరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు.
By తోట వంశీ కుమార్ Published on 27 Oct 2022 11:14 AM ISTఅర్థరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ఆ అలికిడి మేలుకున్న కోడలు వారిని ప్రతిఘటించింది. వారి చేతిలో తీవ్రంగా గాయపడింది. ఓ వైపు రక్తం కారుతున్నా ప్రతిఘటించడంతో దొంగలు అక్కడి నుంచి పరారు అయ్యారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. చీమలాపల్లిలో ఆళ్ల అప్పారావు, లలితకుమారి దంపతులు పెద్ద కుమారుడు వినయ్‌కుమార్, చిన్న కుమారుడు అవినాష్‌కుమార్ అతడి భార్య లావణ్య తో కలిసి నివసిస్తున్నారు. అవినాష్ ఓ కంపెనీలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతడు కంపెనీకి వెళ్లాడు. ఓ గదిలో లావణ్య నిద్రిస్తుండగా.. మరో గదిలో అప్పారావు, లలిత కుమారి, వినయ్‌కుమార్ పడుకున్నారు.
మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత నలుగురు దుండగులు ఇంటి కిటికీ గ్రిల్‌ను తొలగించి లోపలికి ప్రవేశించారు. అప్పారావు, లలిత కుమారి, వినయ్‌కుమార్ పడుకున్న గది తలుపు గడియను పెట్టారు. లావణ్య నిద్రిస్తున్న తలుపును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. ఆ అలికిడికి లావణ్య నిద్ర లేచింది. బీరువాను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న దొంగలను అడ్డుకుంది.
గట్టిగా కేకలు వేయడంతో దొంగలు కత్తితో ఆమెపై పలుచోట్ల దాడి చేశారు. అప్పారావు, లలిత కుమారి, వినయ్‌కుమార్‌లు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా గది బయట గడియవేసి ఉండడంతో వాళ్లు రాలేని పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో పాటు లావణ్య గట్టిగా అరుస్తుండడంతో స్థానికులు అక్కడకు వచ్చే లోపు దొంగలు అక్కడ నుంచి పరారు అయ్యారు. కుటుంబీకులు లావణ్యను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.