ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని ఎమోషనల్ అయ్యారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వేదికగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వేదికపై నుంచి రజని ప్రసంగిస్తూ తాను జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. అంతేకాకుండా తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని, ఈ రాజకీయ జీవితం, మంత్రి పదవి జగన్ పెట్టిన భిక్ష అని చెప్పారు. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పేదల గుండెల్లో నిలిచిన నేత సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు ఇక్కడి ప్రజల తరపున పాదాభివందనాలతో స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను..అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచి సంచలనం సృష్టించిందని చెప్పారు.16 ఏళ్ల తరువాత వైద్యరంగంలో ఇదే ఏప్రిల్‌లో ఆ మహానేత తనయుడు సీఎం వైయస్ జగన్ తండ్రికి మించి పేదలకు మంచి అని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రారంభించారని అన్నారు.