బాలకృష్ణపై కౌంటర్లు వేసిన మంత్రి శంకర్ నారాయణ
Minister Shankar Narayana countered Balakrishna. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ..
By అంజి Published on 4 Feb 2022 2:45 PM GMTఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. హిందూపురం టౌన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు కూర్చున్నారు. దీక్షకు ముందు మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే పోరాటంలో భాగంగా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాత్రికి రాత్రే కొత్త జిల్లాల ప్రకటన చేశారని.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక అంశాల ఆధారంగానే సత్యసాయి జిల్లా, దాని కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మికత ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ధర్నాలు చేయబోరని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. తనకంటే అధికంగా ఆధ్యాత్మిక చింతన ఎవరికైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తాను అఖండ అని, అన్ స్టాపబుల్ గా పోరాడతానని అన్నారు. ఈ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ మౌనదీక్షపై ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పందించారు. సినిమా షూటింగులు లేనప్పుడే బాలకృష్ణకు హిందూపురం ప్రజలు గుర్తొస్తారని.. ఎమ్మెల్యే అయినప్పటికీ హిందూపురానికి ఆయన చుట్టపుచూపుగా వస్తుంటారని విమర్శించారు.ఏడేళ్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి ఏంచేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. బాలకృష్ణ రాజీనామా చేయాలని హిందూపురం ప్రజలే కోరుకుంటున్నారని.. పెనుకొండ జిల్లా కేంద్రం కావాలని తమకూ ఓ కోరిక ఉందని, అయితే ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి కేంద్రంగా జిల్లాను ప్రకటించడం తమకు ఆనందం కలిగించిందని చెప్పారు. రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్షలు చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు.