అసెంబ్లీలో సీఎం జగన్ కు సెల్యూట్ చేసిన మంత్రి రోజా

మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సెల్యూట్ చేశారు.

By Medi Samrat
Published on : 25 Sept 2023 7:14 PM IST

అసెంబ్లీలో సీఎం జగన్ కు సెల్యూట్ చేసిన మంత్రి రోజా

మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సెల్యూట్ చేశారు. మహిళ కష్టాలను తీర్చిన ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.మహిళలకు జగన్ అనేక పథకాలు తీసుకు వచ్చారని.. ఆడపిల్లల కష్టాలు జగన్‌కు తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని చెప్పారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, ఆయనది బోగస్ ఆలోచన అన్నారు. చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్ అన్నారు. ప్రస్తుతం తాము 14 మంది మహిళా ఎమ్మెల్యేలం ఉన్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చాక 58కి చేరుకుంటామన్నారు. మహిళల గురించి చర్చ జరుగుతుంటే టీడీపీ సభలో లేకపోవడం సరికాదని, వారికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తోందన్నారు. బయట మహిళలను ఉద్ధరిస్తామని చెబుతారని, కానీ అసెంబ్లీలో మహిళల కోసం చర్చ సాగుతుంటే రాలేదన్నారు. మహిళా రిజర్వేషన్ కు మద్దతు తెలిపిన జగన్‌కు రోజా అసెంబ్లీ సాక్షిగా సెల్యూట్ చేశారు.

జగన్ ఈ నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. పసుపు జెండా, ఎర్రజెండా లేదా ఏ జెండా పట్టుకున్న వారైనా జగన్‌లా మహిళా అజెండాతో పనిచేసే వారిని చూపించాలని సవాల్ చేశారు. జగన్‌ను ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి జైలుకు వెళ్లాడని, భయం ఎలా ఉంటుందో జగన్‌కు పరిచయం చేస్తానని చెప్పిన లోకేశ్ భయపడి ఢిల్లీకి పారిపోయాడని అన్నారు. జగన్‌ను ఇంటికి పంపించడం, పార్టీ లేకుండా చేయడం వారి వల్ల కాదన్నారు.

Next Story