చిరు వ్యాఖ్యల దుమారం.. రోజా ఎంట్రీ

వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.

By Medi Samrat  Published on  9 Aug 2023 3:15 PM IST
చిరు వ్యాఖ్యల దుమారం.. రోజా ఎంట్రీ

వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చిరంజీవి చెబితే పని చేసే పరిస్థితుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేరని అన్నారు. గడపగడపకూ వచ్చి చూస్తే తమ ప్రభుత్వం రోడ్లు వేసిందో? లేదో? తెలుస్తుందన్నారు. చిరంజీవికి ఏం అర్హత ఉందని సినిమా టిక్కెట్ ధరలు పెంచమని అడిగారని.. హీరోలందరూ కలిసి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదని, పవన్ కళ్యాణ్, చిరంజీవి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఏం చేశారో చెప్పాలని.. అప్పుడే ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టం చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా ఆయన ఒక్క ప్రాజెక్టు అయినా చేపట్టారా? అని ఆగ్రహించారు. హోదా గురించి ఆ రోజే పోరాడాల్సిందన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ చేసిన అభివృద్ధిని గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు.

ఏపీలో ఇంతటి అభివృద్ధి ఇతర సీఎంలు ఎవరైనా చేశారని చూపించగలరా? అని తాను చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు సవాల్ విసురుతున్నానని రోజా అన్నారు. చిరంజీవి ఏ పరిస్థితుల్లో మాట్లాడారో కానీ ఆయన మాట్లాడింది మాత్రం సరైనది కాదన్నారు. సినిమా ఫంక్షన్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని, అలా చేస్తే ఊరుకునేది లేదన్నారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదన్నారు. గతంలో పీఆర్పీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇక తన వల్ల కాదని రాజకీయాలు వదిలి తిరిగి సినిమాల్లోకి వెళ్లారన్నారు. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారనేది తన ఉద్దేశ్యమని, రాజకీయాల్లోకి మాత్రం వస్తారని అనుకోవడం లేదన్నారు.

Next Story