'జగనన్న స్పోర్ట్స్ క్లబ్' యాప్.. లాంచ్‌ చేసిన మంత్రి రోజా

Minister Roja launched the 'Jagananna Sports Club' app. రాష్ట్ర క్రీడాకారులను ఆదుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధికారత సాధించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం

By అంజి  Published on  8 Sept 2022 8:40 PM IST
జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్.. లాంచ్‌ చేసిన మంత్రి రోజా

రాష్ట్ర క్రీడాకారులను ఆదుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధికారత సాధించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం 'జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్'ను తీసుకొచ్చిందని ఏపీ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఏపీ సచివాలయంలో జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను మంత్రి రోజా సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు పలువురు క్రీడాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటు, జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను వినియోగించే విధానం, నూతన క్రీడా విధానం తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడలకు సంబంధించి అనేక ప్రయోజనాలు చేకూర్చే జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసి క్రీడాకారులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ యాప్‌లో తమ గేమ్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం ద్వారా ఆటగాళ్లు ప్రోత్సాహకాలను పొందగలుగుతారు.

Next Story