బాలకృష్ణ సినిమాల్లోనే డైలాగులు చెప్తాడా.. అసెంబ్లీలో చెప్పడం రాదా?
రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే టీడీపీ చర్చ కోసం వచ్చిందా.. రచ్చ కోసం వచ్చిందా
By Medi Samrat Published on 22 Sept 2023 7:18 PM ISTరెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే టీడీపీ చర్చ కోసం వచ్చిందా.. రచ్చ కోసం వచ్చిందా అనేది ప్రజలకు అర్ధమై ఉంటుందని మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి చేశారని అన్నారు. నిన్న తొడకొట్టిన బాలకృష్ణ.. ఈ రోజు స్కిల్ స్కాంపై చర్చించకుండా తోకముడిచి ఎందుకు పారిపోయాడు..? మీసం తిప్పిన బాలకృష్ణ.. ఈ రోజు అజెండాలో స్కిల్ కేసుపై చర్చ ఉండటంతో పారిపోయారెందుకు.. రోషం లేదా? మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా.? అని ప్రశ్నించారు.
అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక బాబుపై కేసు కొట్టేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని అరిచాడని భాలకృష్ణపై మండిపడ్డారు. చంద్రబాబు సీటు మీద మనసు పడ్డాడో ఏమో ఆ సీటెక్కి కూర్చోలేక, నిల్చోలేక చిల్లర చేష్టలు చేశాడని ఎద్దేవా చేశాడు. బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్ వేస్తూ చిల్లర చేష్టలు చేశారని మండిపడ్డారు. హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది.. ఇప్పుడేమంటావ్ బాలకృష్ణ..? అని ప్రశ్నించారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే బాబుపై కేసులు ఎత్తివేయమని కోర్టులోనూ ఇలాగే తొడకొట్టి, విజిల్స్ వేయండి.. అప్పుడు తెలుస్తుందని చురకలు అంటించారు. బాలకృష్ణ సినిమాల్లోనే డైలాగులు చెప్తాడా.. అసెంబ్లీలో చెప్పడం రాదా? అని ప్రశ్నించారు. స్కాం నిజమా.. కాదా.. అని చెప్పే అవకాశం వచ్చినప్పుడు బాలకృష్ణ చర్చించకుండా పారిపోయాడు అంటే అర్ధం ఏమిటి? ప్రభుత్వం వద్ద ఆధారాలే లేవు.. స్కాం జరగలేదు అన్న పెద్ద మనుషులు ఈ రోజు ఎందుకు పారిపోయారని ఎద్దేవా చేశారు.