చిరంజీవికి సడన్ గా ఏమైందో.. : మంత్రి రోజా
ఏపీ మంత్రి రోజా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 12 Aug 2023 1:15 PM GMTఏపీ మంత్రి రోజా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి అని భావించామని, కానీ సడన్‌గా ఆయనకు ఏమైందో కానీ జగన్‌కు సలహాలు ఇస్తూ విషం చిమ్మడం ప్రారంభించారని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లు ఏపీలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటామని ఎప్పుడైనా చెప్పారా? వారికి కనీసం ఆ ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా ఇడుపులపాయలో ఇల్లు నిర్మించుకొని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించే ఉద్ధేశ్యంతో ముందుకు సాగారని, ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినా భరించారన్నారు.
కొండలపై కట్టడాలు వద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారన్నారు. రిషికొండ పేరుతో పవన్ హడావిడి చేశారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్ కొండపైనే ఉన్నాయి కదా అన్నారు. సుప్రీం కోర్టు రిషికొండలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు కంటే పవన్ గొప్పవాడా? అని ప్రశ్నించారు. తాము కట్టే ప్రతి కట్టడాలకు అనుమతి తీసుకున్నామన్నారు. ఇది అక్రమ కట్టడం కాదని, ప్రభుత్వ కట్టడమన్నారు. చంద్రబాబు చెప్పినట్లు వినే బానిస పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని అడగడానికి నువ్వెవరు అని నిలదీశారు. జగన్ కన్ను తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. చంద్రబాబు ప్రజల డబ్బును వృథా చేశారన్నారు. ఆయన తన కరకట్ట ఇంటికి రూ.40 కోట్లు, సీఎం ఆఫీస్ ఫర్నీచర్ కు రూ.10 కోట్లు, హైదరాబాద్‌లోని తన నివాసాలన్నింటికి కలిపీ రూ.50 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇలా మొత్తం రూ.187 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.