వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు : రోజా
Minister Roja Comments On Chandrababu. చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విమర్శలు
By Medi Samrat Published on 22 Feb 2023 6:20 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. గన్నవరంలో జరిగిన ఘటనలపై రోజా మాట్లాడుతూ.. దౌర్జన్యం, గూండాయిజం అనేది టీడీపీ హయాంలో జరిగిందని విమర్శించారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న సైకోలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని.. గత ఎన్నికల్లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తే చంద్రబాబు ఆంధ్రలో నుంచి పారిపోయి హైదరాబాద్‌లో ఉన్నారని.. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారని అన్నారు. సీఎం జగన్ మంచి పని చేసినప్పుడల్లా ఆయనకు క్రెడిట్ రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారనే విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని అన్నారు. దీనిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకుంటున్నారని.. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోకుండా.. తనకున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని రోజా అన్నారు.