పోలవరం, నల్లమల్లసాగర్‌పై తెలంగాణతో న్యాయపోరాటానికి ఏపీ సిద్ధం: మంత్రి నిమ్మల

పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యాయ బృందాన్ని, ఉన్నతాధికారులను ఆదేశించారు.

By -  Knakam Karthik
Published on : 11 Jan 2026 7:49 PM IST

Andrapradesh, Minister Nimmala Ramanaidu, Polavaram-Nallamalasagar link project, Supreme Court, Telangana

పోలవరం, నల్లమల్లసాగర్‌పై తెలంగాణతో న్యాయపోరాటానికి ఏపీ సిద్ధం: మంత్రి నిమ్మల

అమరావతి: పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం (జనవరి 12న) విచారణ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపోరాటానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ కేసులో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు న్యాయ బృందాన్ని, ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఆదివారం ఆయన ఈ అంశంపై సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, కీలకమైన సమాచారాన్ని వెంటనే న్యాయవాదుల బృందానికి అందించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్-ఇన్-చీఫ్ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏటా గోదావరి నది నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందులో నుంచి కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. దిగువ రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే హక్కు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అవార్డు ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

"మేం స్నేహ హస్తం అందిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసేలా కోర్టుకు వెళ్లడం విచారకరం" అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి వాడుకోవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని, కేవలం మిగులు వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటికే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, వారి సూచనల మేరకు మార్పులు చేస్తున్నామని తెలిపారు.

Next Story