విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ..చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా సీఎం చంద్రబాబు చొరవతీసుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 40శాతంకు పైగా పనులు పూర్తి చేస్తే, వైసిపి పాలనలో పూర్తిగా పనులను నిలిపేశారని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ పాలనా నిర్లక్ష్యం కారణంగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి అని మంత్రి నిమ్మల ఆరోపించారు. వరదల సమయంలో 90 రోజుల పాటు 53.50 టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్ట్‌ను గత టిడిపి ప్రభుత్వం రూపొందించింది. చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తి చేసి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల మెట్టప్రాంతాలకు సాగు, తాగు నీరందిస్తాం..అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.