అమరావతి: నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయిస్తాం..అని మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. పట్టణాల్లో మౌళిక వసతుల కల్పనపై మున్సిపాల్టీ అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. మొదటి రోజు సమావేశానికి 27 మున్సిపాల్టీల కమిషనర్లు, ఇంజినీర్లు హాజరయ్యారు. 2029లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..మున్సిపాల్లీల్లో ఘన, ద్రవ వ్యర్ధాలు, డ్రైనేజి, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలి. జనవరి నుంచి ఘన వ్యర్ధాల నిర్వహణ 100 శాతం జరుగుతుంది. రెండేళ్లలో మున్సిపాల్టీల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్దం చేసాం. వివిధ కేంద్ర పథకాలు, ఫండింగ్ ఏజెన్సీల ద్వారా మున్సిపాల్టీల్లో పనులు చేపడున్నాం. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ది పనులను పూర్తి చేయాలి. అమృత్, ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(AIIB), అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్(UIDF) నిధుల ద్వారా డ్రింకింగ్ వాటర్,డ్రైనేజి నిర్మాణాలు చేపడుతున్నాం. నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయించాలి. వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలి..అని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.