అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో లోపల వర్క్ జరుగుతోందని, వర్షం లేనప్పుడు బయట పని చేస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లోనూ క్యాపిటల్ సిటీని వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అటు సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించేందుకు సీఎం ఆ దేశానికి వెళ్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించిందన్నారు.
మంత్రి నారాయణ ఇవాళ రాజధానిలో పర్యటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే అమరావతిలో నిర్మిస్తున్న క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రూప్-డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల దగ్గర జరుగుతున్న పనుల తీరుపై ఆరా తీశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువు లోపల నిర్మాణాలు పూర్తి చేసేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వంద శాతం వచ్చే మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే మార్చి నాటికి 4 వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.