అమరావతిపై ఎలాంటి అనుమానాలు వద్దు.. రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
By Medi Samrat
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని.. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని స్సష్టం చేసారు.. అమరావతిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం, 30 వేల ఎకరాల భూసమీకరణపై రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.
అమరావతి నిర్మాణం అంటే కేవలం మౌళిక వసతుల కల్పన మాత్రమే కాదని.. జనాభా రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు జరగాలన్నారు. రైతుల భూముల ధరలు నిలవాన్నా.. ధరలు పెరగాలన్నా పరిశ్రమలు ఏర్పాటు ముఖ్యమన్నారు..అమరావతిలో కాలుష్య భరితమైన పరిశ్రమలు కాకుండా స్మార్ట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావల్సి ఉంటుందని, అందుకోసమే ఫ్లైట్ కనెక్టవిటీ ఉండేలా ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5వేల ఎకరాల భూమి అవసరం అన్నారు. అయితే దీనికోసం భూసేకరణ చేయాలా.. ల్యాండ్ పూలింగ్ చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.. ఇప్పటికే అమరావతిలో 64 వేల కోట్ల పనులకు పరిపాలనా ఆమోదం లభించిందని, చాలా వరకూ టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి.
అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ.. ఏడాదిలోగా అధికారుల నివాసభవనాలు పూర్తి చేస్తామని.. ఏడాదిన్నరలోగా ట్రంక్ రోడ్లు, రెండున్నరేళ్లలో లే అవుట్ రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరోసారి స్సష్టం చేసారు.