విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By - Knakam Karthik |
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే విశాఖలో పెట్టుబడుల జాతర మొదలుకానుంది. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు. సెయిల్స్ సాఫ్ట్‌వేర్, ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వీటిలో ఉన్నాయి. వేల కోట్ల పెట్టుబడులతో పాటు పెద్దఎత్తున యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే విశాఖలో తమ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. టీసీఎస్ ద్వారా 12 వేలు, కాగ్నిజెంట్ ద్వారా 8 వేల ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే డిజిటల్ ఏపీ, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సెయిల్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలోని ఐటీ హిల్ నం.3లో అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ దేశంలో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, ఆర్ అండ్ డీ హబ్‌లను నిర్వహిస్తోంది. ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ విశాఖలో ఐటీ హిల్ నెం.2లో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఏఐ, ఆటోమేషన్-ఎనేబుల్డ్ బీపీవో లేదా కేపీవో సామర్థ్యాలతో హెల్త్‌కేర్ ఐటీఈఎస్ (ITES) సేవల డెలివరీ, ఏజెంట్ ఏఐ, ఏఐ సొల్యూషన్స్‌పై దృష్టి సారించనుంది. 60 మిలియన్ డాలర్ల వార్షికాదాయం ఉన్న ఈ సంస్థకు మన దేశంలో 1200, అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు.