ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడాలంటూ కార్యకర్తలకు మంత్రి లోకేశ్ సూచించారు. నాలుగు గోడల మధ్య ఆయన చేస్తున్న తప్పులను చెప్పి సరి చేయాలన్నారు. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి అడ్డాలని, ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావును వైసీపీ ప్రభుత్వంలో జైల్లో పెట్టి వేధించారని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా 53 రోజులు జైలులో పెట్టారన్నారు. ఆ సమయంలో రాజమండ్రిలోని టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే 164 సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.