కొత్త రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకోవాలంటే పెళ్లి కార్డు తప్పనిసరి కాదు అని స్పష్టంగా తెలిపారు. కొన్నిచోట్ల అధికారులు పెళ్లి కార్డు లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తుండటంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఆయన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు.
భార్యా-భర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. విడిపోయిన దంపతులు ఏడేళ్లకు పైగా వేర్వేరుగా ఉంటే, వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులకు అర్హులవుతారని ప్రకటించారు. దీనివల్ల తమకు కావలసిన రేషన్, ఇతర ప్రభుత్వ పథకాల్లో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల నిజంగా అర్హులైనవారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రి అంగీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశముంది అని పేర్కొన్నారు.