కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 1 April 2025 4:42 PM IST

Andrapradesh, Minister Nadendla Manohar, AP Government, New Ration Cards

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం అని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తాం..అని మంత్రి మనోహర్ తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి ఎక్కడా కూడా బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవు అని తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు.

మంగళవారం నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభం అయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకుననట్లు చమురు కంపెనీలు తెలిపాయని మంత్రి వెల్లడించారు. అటు రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్‌లో 35.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు రూ.8279 కోట్లు చెల్లించాం. 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు జరిగాయి. వాట్సాప్‌లోనూ ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాం. మొత్తం 16 వేల మంది రైతులు వాట్సాప్ ద్వారానే ధాన్యం విక్రయించారని.. మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

పాఠశాలల్లో జూన్ నుంచి మధ్యాహ్నం భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఐదు గోదాముల్లో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేయిస్తున్నాం అన్నారు. రబీలోనూ ఖరీఫ్ బియ్యం కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండీయూలు కొనుగోలు చేసి దుర్వినియోగం చేసింది. ఇది పెద్ద కుంభకోణం. దీనిపై విచారణ జరుగుతోంది. త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తాం..అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Next Story