అమరావతి: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తున్నామని, కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. నవంబర్‌లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు 50 వేల టార్పాలిన్లు ఇస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవుంటే తర్వాతి రోజు డబ్బులు పడతాయని మంత్రి తెలిపారు.
24 గంటల్లోపే ధాన్యం అమ్మిన రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. ప్రతి రోజు నాలుగు స్లాట్స్ ద్వారా నగదు జమ చేస్తున్నామన్నారు. అలాగే జనవరి నుండి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దీపం పధకం కింద 90 లక్షల లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్లు పొందారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు స్మార్ట్ కార్డ్‌లు 92% పంపిణీ పూర్తి అయ్యిందని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మొంథా తూఫాన్ ప్రభావంతో దాదాపు 2 లక్షల 39 వేల 161 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశామని మంత్రి నాదెండ్ల తెలిపారు.