క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. 3 శాతం స్పోర్ట్స్‌ కోటా అమలు

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.

By అంజి
Published on : 30 Aug 2025 8:39 AM IST

Minister Lokesh, 3 percent sports quota, sports, APnews

క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. 3 శాతం స్పోర్ట్స్‌ కోటా అమలు 

వైజాగ్: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ పేరిట భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబాబుకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా గ్రామాన్ని కూడా ఆయన నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే పదేళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాం. గ్రాస్ రూట్ లెవల్ లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అయితే క్రీడల్లో బాలికలను ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రుల మైండ్ సెంట్ లో మార్పు రావాల్సి ఉంది.

10 ఏళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికలు

ఇప్పటికిప్పుడు క్రీడలను అభివృద్ధి చేయడానికి మౌలిక సదుపాయాలు, ప్లేగ్రౌండ్ల కొరత ఉంది. రాష్ర్టంలో 43వేల పాఠశాలలు ఉన్నా తగినంతమంది పిఇటిలు లేరు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా క్రీడారంగాన్ని మార్చడం కష్టతరమైన పని అని అన్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఈస్థాయికి ఎదిగిన మీ ప్రయాణం అంత తేలికైనది కాదు, చాలా కాలం పాటు మహిళల క్రికెట్‌ను పురుషుల ఆటకు సబ్ సెక్టార్ గా మాత్రమే చూసేవారు. మీకు సరిపడా మీడియా కవరేజ్, సదుపాయాల కొరత, ప్రోత్సహా లేమి వంటి ఎన్నో సమస్యలను మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీ అసమాన ప్రతిభతో భారత క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారని కొనియాడారు. గత వరల్డ్ కప్‌లలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది, మీ మ్యాచులకు అభిమానులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఈసారి కూడా మీ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా. మీరు పొందిన ఆసియా గేమ్స్ బంగారు పతకం (2022), ICC అండర్-19 మహిళల టీ20 కప్ (2025), ఏడుసార్లు ఆసియా కప్ విజయం — అద్భుతమైన విజయాలు మాత్రమే కాదు, అవి మీలో దాగి ఉన్న అద్వితీయమైన శక్తికి నిదర్శనం.

బిసిసిఐ చొరవ అభినందనీయం

లింగ అసమానతలను తొలగించేందుకు బిసిసిఐ చొరవ అభినందనీయం. BCCI మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు, సమాన వేతన విధానాన్ని తీసుకువచ్చినందుకు అభినందనలు. జెండర్ తో సంబంధం లేకుండా క్రికెటర్లను‌ ప్రోత్సహించడంలో ఇదో కీలకమైన పరిణామం. అయితే ఇది ఆరంభం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో సదుపాయాల మెరుగుదల, మహిళల క్రీడలకు ప్రోత్సహం కల్పిస్తేనే బాలికల క్రీడా కలలు నెరవేరతాయి. మేము మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు, వార్షిక కోచింగ్ క్యాంప్‌లు, హాస్టల్ వసతి వంటి క్రియాశీలమైన కార్యక్రమాలు చేపట్టాం. దీనివల్ల ప్రతిభ గల క్రీడాకారిణులకు ఉద్యోగ, విద్యా అవకాశాలు మరింత మెరుగవుతాయి. క్రీడాకారిణులకు ప్రయాణ భత్యం, పారా-అథ్లెట్లు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం ద్వారా అవకాశాలను మరింత విస్తరిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

క్రీడాకారులకు ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించాలి

ఈ సందర్భంగా మహిళా క్రీడాకారిణులు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. టోర్నమెంట్లలో పాల్గొనే మహిళా క్రీడాకారులకు సులభతరమైన ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించాలి. ఇంటర్ స్కూల్ నుంచి జాతీయస్థాయి వరకు క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ఎకో సిస్టమ్ కల్పించాలి. క్రీడలపై ఆసక్తి ఉన్న నిరుపేద క్రీడాకారిణులకు స్కాలర్ షిప్ లు, స్పోర్ట్స్ కిట్లు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందకు ప్రత్యేక స్పోర్ట్స్ క్యాంపులు నిర్వహించాలి. స్పోర్ట్స్ ను కూడా ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా మాజీ క్రికెటర్ మిథాలీరాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆర్ సిబి కెప్టెన్ స్మృతి మందానా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అంతర్జాతీయ క్రికెటర్ ఎంఎస్ కె ప్రసాద్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, విశాఖపట్నం ఎంపి ముతుకుమిల్లి శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story