అమరావతి: గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలిపారు. కేంద్రప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రి నిరంతరం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెప్పారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటాలు కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి లోకేష్ తెలిపారు. 2024-25 సంవత్సరంలో రైతులు పండించిన 2.58 లక్షల టన్నుల మిర్చిని కనీస మద్ధతుధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, ముఖ్యమంత్రి వినతికి పెద్దమనసుతో సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.