అమరావతి: విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్‌తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. వన్ క్లాస్ - వన్ టీచర్ విధానాన్ని 10 వేల స్కూళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పని చేయలేరని లోకేష్ అన్నారు. టీచర్లపై ఒత్తడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు.
చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే కేబినెట్ భేటీలో టీచర్ల బదిలీల చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జీవో 117పై అన్ని ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించామన్నారు. వైసీపీ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా చర్చలకు పిలిచామన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.