వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By - Knakam Karthik |
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోండి. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించండి. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించండి. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
WSU సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, పరిశోధకులు యూనివర్సిటీ ప్రత్యేకతలను తెలియజేస్తూ... 1989లో ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీలో స్థాపించబడిన వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం (WSU) కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్స్, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించిన ప్రముఖ విద్యాసంస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిశ్రమతో అనుసంధానమైన కోర్సులకు ప్రసిద్ధి చెందిన WSU... ఆరోగ్య, విద్య, వ్యాపార, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రావీణ్యం సాధించింది. స్థిరమైన అభివృద్ధిపై ప్రభావం చూపడంలో ప్రపంచంలో నెం.1 స్థానంలో ఉంది (THE Impact Rankings 2023 ప్రకారం). ప్రపంచంలోని టాప్ 2% విశ్వవిద్యాలయాల్లో WSU స్థానం సంపాదించింది (QS World University Rankings 2023 ప్రకారం). 70కి పైగా దేశాల నుండి 49వేల మందికి పైగా విద్యార్థులు, 3వేల మందికి పైగా సిబ్బందితో ఆస్ట్రేలియాలోని అతిపెద్ధ, వైవిధ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిందని చెప్పారు.