సింగపూర్‌కు 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలు..మంత్రి లోకేశ్ ఏమన్నారంటే?

రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

By -  Knakam Karthik
Published on : 5 Nov 2025 8:30 PM IST

Andrapradesh, Amaravati, Minister Nara Lokesh, Education Department

సింగపూర్‌కు 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలు..మంత్రి లోకేశ్ ఏమన్నారంటే?

అమరావతి: అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఈనెల 27నుంచి డిసెంబర్ 2వతేదీ వరకు వారంరోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి, అక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని అన్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి. గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5వతేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ ను రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. విద్యార్థుల పనితీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా లీప్ యాప్ ను డిజైన్ చేశాం, దీని పై విస్తృతంగా ప్రచారం చెయ్యాలని అన్నారు.

డిఇఓ, ఎంఇఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. ఈ-ఆఫీసును బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. లీప్ -1 గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై వందరోజుల కార్యాచరణను సిద్ధం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. నేషనల్ బెంచ్ మార్కుకు అనుగుణంగా పరక్, ఇతర విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా భవిత ఆటిజం సపోర్టు సెంటర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీపై దృష్టిపెట్టాలి. ఇందుకోసం ఏర్పాటుచేసిన శాసనసభ్యుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్పులకు ఎంపికకు అవసరమైన 8వతరగతి విద్యార్థులను చైతన్యపర్చి వారికి ప్రోత్సాహం కల్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. అమరావతి లో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు, పబ్లిక్ లైబ్రరీల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరులశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, సమగ్రశిక్ష స్టేట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story