ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

By Knakam Karthik  Published on  31 Jan 2025 5:17 PM IST
Andrapradesh, Education Minister Nara Lokesh, Unemployees, Dsc Notification, Aspirants

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతిలో టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణ ఉంటోందని అన్నారు. ప్రతీ శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలపై కమిషనర్ అందుబాటులో ఉంటున్నారని, తాను కూడా కలుస్తున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకే బదిలీ చట్టం తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని అన్నారు. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

రాష్ట్రంలోని గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3 వేల కోట్లు పెట్టిందని, తమ ప్రభుత్వ విడతగా రూ.800 కోట్లు చెల్లించినట్లు మంత్రి లోకేశ్ చెప్పారు. జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు పెట్టిన బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగ బకాయిలు కూడా మేమే తీరుస్తున్నాం అని లోకేశ్‌ చెప్పారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. విద్యార్థుల సంఖ్య కచ్ఛితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ ఔట్స్ నివారణకు ప్రత్యేయక వ్యవస్థ తీసుకొస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

Next Story