విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేయగలరు మీరు.? : మంత్రి కొలుసు పార్థసారథి
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతినీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎల్లపుడూ స్మరించకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
By Kalasani Durgapraveen Published on 2 Nov 2024 8:06 AM ISTఅమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతినీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎల్లపుడూ స్మరించకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ఆవిర్భావ దినంపై అనవసర రాద్ధాతం చేస్తున్నారు. ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడతీయాలన్న ప్రజల ఆకాంక్షలను అమరజీవి పొట్టిశ్రీరాములు దీక్ష ప్రతిబింబించింది. తెలుగు వారి అభిమతం కోసం ఆయన 56 రోజులు కఠోర నిరాహార దీక్ష చేయడం చరిత్రాత్మకం. ఆయన ఆత్మత్యాగం గుర్తుగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం, అనంతరం 1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ, 2014 జూన్ 2 న తెలంగాణా నుండి విడిపోవడం మరవ లేని సత్యాలు. పొట్టి శ్రీరాములు బలిదానాన్ని గౌరవించేలా మా కూటమి ప్రభుత్వం ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను చిరస్మరణీయంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై స్పష్టతనూ ఇస్తుంది. ఆయన జన్మస్థలాన్ని ప్రభుత్వం మెమోరియల్ గా అభివృద్ది చేయడం కోసం కృత నిశ్చయంతో ఉన్నాం.
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని పట్టాల పైకి ఎక్కిస్తున్న కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే నిత్యం ఎదురు చూసే వైఎస్ఆర్సీపీ నాయకులకు చరిత్రకు విపరీత భాష్యాలు ఇవ్వడం తప్ప పనేం ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. రాష్ర్ట ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తడంతో తట్టుకోలేక విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేయగలరు మీరు. ఆడపడుచులకు దీపావళి కానుకగా దీపం 2.0 ప్రారంభించడం చూడలేక పోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమత్తులు చేపట్టి ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తాం అన్నారు. చారెడు మట్టి కూడా వేయక రోడ్లపై తిరిగి వందలాది మంది గత ఐదేళ్లలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భవిష్యత్తులో తరతరాలు గుర్తుంచుకునేల ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ది చేయడం లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మీరు సృష్టించిన విధ్వంసం నుండి ప్రజలను గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిరంతరం ప్రగతి యజ్ఞం జరుగుతుందని ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాం అన్నారు.