పవన్ కళ్యాణ్ కు బెదిరిపోయే వాళ్ళము కాము : కొడాలి నాని

Minister Kodali Nani Comments On Pawan Kalyan. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెంట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా

By Medi Samrat  Published on  3 Oct 2021 9:06 AM GMT
పవన్ కళ్యాణ్ కు బెదిరిపోయే వాళ్ళము కాము : కొడాలి నాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెంట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పలువురు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. తాజాగా కొడాలి నాని మరోసారి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాటలకు భయపడిపోయే వాళ్ళము కామని కొడాలి నాని అన్నారు. పవన్‌ కళ్యాణ్ ఆ..హు.. అంటే అదిరి బెదిరి పోయే వాళ్లము కాదని కొడాలి నాని స్పష్టం చేశారు. నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని అన్నారు. సినీ పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ న్యాయం జరగాలి. ఇష్టం వచ్చినట్లు టికెట్‌ రేట్లు పెంచుకోవడాన్ని మేము సమర్థించము. కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలని విధానపరంగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టికెట్‌ రేట్లు పెంచారు. చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి అని మంత్రి చెప్పుకొచ్చారు.

ఆదివారం రామానాయుడు స్టూడియోలో 'ఆటో రజనీ' మూవీ ఓపెనింగ్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జొన్నలగడ్డ హరి హీరోగా, శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాకు మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, ఎంపీ నందిగం సురేష్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చురేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.


Next Story
Share it