Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం

మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 2:01 PM IST

Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం

మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురం జిల్లాలో కూలిన 300 విద్యుత్ స్తంభాల పునరుద్ధరణలో 80 శాతం పూర్తి అయ్యాయ‌ని.. మిగిలిన విద్యుత్ పనులు రాబోయే 2 గంటల్లో పూర్తిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామ‌ని తెలిపారు. జిల్లాలో 54 సబ్‌స్టేషన్లు తుఫాన్ ప్రభావానికి లోనైనట్లు మంత్రి వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా వేగవంతం చేశామ‌ని.. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, ముమ్మిడివరం నుంచి సిబ్బంది తరలించిన‌ట్లు తెలిపారు.

134 కిమీ రహదారులపై కూలిన వృక్షాలు తొలగించి రాకపోకలు పునరుద్ధరణ చేశామ‌ని.. నేటి నుండి ఆర్టీసీ బస్సులు నూటికి నూరు శాతం రాకపోకలు నిర్వహణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. 400 పునరావాస కేంద్రాల్లో 10,150 మందికి ఆశ్రయం కల్పించామ‌ని.. ప్రతి కుటుంబానికి ₹3,000, ఒంటరి వ్యక్తులకు ₹1,000 ఆర్థిక సహాయం అంద‌చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయ‌నున్నామ‌ని.. రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ నేటి నుంచే ప్రారంభం అయ్యింద‌న్నారు. 20,000 ఎకరాల వరి పంట, ఉద్యాన పంటలు తుఫాన్ ప్రభావానికి లోనైనట్లు మంత్రి పేర్కొన్నారు.. పంట నష్టాల అంచనాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసింద‌న్నారు. మామిడికుదురు మండలంలో మరణించిన మహిళ కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సహాయక చర్యల్లో కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story