సోమవారం (సెప్టెంబర్ 12)న అమరావతి నుంచి ప్రారంభమైన మహా పాదయాత్రకు భద్రత కల్పించేందుకు అమరావతి రైతులు బౌన్సర్లను నియమించుకోవడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు రైతులు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. "నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చాను" అని అన్నారు. వ్యక్తిగతంగా మూడు రాజధానులనే కోరుకుంటున్నట్లు చెప్పారు. మహా పాదయాత్ర భద్రతకు బౌన్సర్లను నియమించుకున్న అమరావతి రైతులపై కారుమూరి మండిపడ్డారు
హైదరాబాద్ కేంద్రీకృత పెట్టుబడుల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయిందని కారుమూరి పేర్కొన్నారు. ఇలాంటి తప్పు చేయకూడదని, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిందని, మహా పాదయాత్ర వల్ల మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని మార్చబోమని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం ఆగదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తేల్చిచెప్పారు.
అమరావతి ప్రాంతంలో ఎత్తైన భవనాలు నిర్మించేందుకు అనువుగా లేదని మంత్రి అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని టీడీపీని ప్రశ్నించారు.
మరోవైపు అమరావతి రైతుల మహా పాదయాత్ర 3వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. దుగ్గిరాల నుంచి ప్రారంభమైన యాత్ర నందివెలుగు, తెనాలి వరకు సాగనుంది. అక్కడ మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ యాత్ర ప్రారంభం కానుంది. పెద్దరావురులో రాత్రి బస చేయనున్నారు. ఇవాళ 15 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేస్తారు. అమరావతి టు అరసవెల్లి సక్సెస్ అయితే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా అమరావతే ఏకైక రాజధాని అనే నినాదానికి గట్టి బలం, పూర్తి మద్దతు వచ్చినట్టే అని అమరావతి రైతులు భావిస్తున్నారు.