ఏ ఆధారం ఉన్నా బయటపెట్టాలి.. సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించి పలు ఆరోపణలు చేశారు

By Medi Samrat  Published on  24 May 2024 7:07 AM GMT
ఏ ఆధారం ఉన్నా బయటపెట్టాలి.. సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించి పలు ఆరోపణలు చేశారు. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరానని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

ఆయ‌న మాట్లాడుతూ.. నా పాస్ పోర్ట్ కారులో దొరికిందని చెప్పారు. నా పాస్ పోర్ట్ నా దగ్గర ఉంది. కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉంది.. సోమిరెడ్డి దగ్గర ఉందా.. కర్ణాటక పోలీసుల వద్ద ఉందా.. దీనికి సోమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ కారుతో నాకున్న సంబంధాలను రుజువు చేయమని కోరా.. కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉంది. కారుకు స్టిక్క‌ర్ ఉందని చెప్పి నా కారు అని చెప్పారు. స్టిక్క‌ర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని.. వారు విచారణ చేస్తున్నారని తెలిపారు.

గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదు. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలని స‌వాల్ విసిరారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి.. పార్టీకి సంబంధం లేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు. కానీ సోమిరెడ్డి మాత్రం ఈ పార్టీని నాకు అంట కడుతున్నారు. క్లబ్ కు వెళ్లడం.. పేకాట ఆడటం.. డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామ‌న్నారు. బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చేందుకు నేను సిద్ధం.. మరో మూడు రోజులు నెల్లూరులో ఉంటా.. దమ్ముంటే సోమిరెడ్డి రావాలని స‌వాల్ విసిరారు.

సోమిరెడ్డి క్యారెక్టర్ పై స్థానిక పత్రికలో వార్తలు వచ్చాయి. దానిపై అప్పట్లో ఆయన ఖండించలేదు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని అన్నారు. సోమిరెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజమేన‌న్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం సరి కాదు అని సూచించారు. కోర్టులో దొంగతనంపై నాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.. ఏ విచారణకైనా నేను సిద్ధం అన్నారు.

Next Story