పవన్ సినిమాల్లో మాత్రమే హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి కాకాణి

Minister Kakani Govardhan Reddy criticized Pawan Kalyan. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు విమర్శల దాడికి దిగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు

By అంజి  Published on  18 Oct 2022 1:39 PM IST
పవన్ సినిమాల్లో మాత్రమే హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి కాకాణి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు విమర్శల దాడికి దిగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. పొలిటికల్‌ బ్రోకర్‌ తరహాలో పవన్‌ కల్యాణ్‌ విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి మాట్లాడారు. చంద్రబాబు ఫ్రెండ్‌షిప్‌తో పవన్‌కి కూడా మతిమరుపు జబ్బు వచ్చినట్టుందని సెటైర్‌ వేశారు. ఆనాడు మూడు రాజధానులకు సరే అని చెప్పిన పవన్‌.. ఇప్పుడు తన నోటితోనే వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు.

పవన్‌ను.. ప్యాకేజీల పవన్‌గా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఒక్క చోట కూడా ప్రజలు గెలిపించలేదని అన్నారు. చంద్రబాబు రాజ్యాంగం సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారని, అయితే ఇప్పుడు అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే పవన్‌ కల్యాణ్‌ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని అన్నారు. చంద్రబాబుకు తన సుపుత్రుడిపై నమ్మకం లేదని, అందుకే దత్త పుత్రుడిని అడ్డు పెట్టుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

2024 జరిగే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమి లేదని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు, పవన్ మధ్య సీక్రెట్‌ అగ్రీమెంట్‌ జగమెరిగిన సత్యం అని అన్నారు. ఏ మాత్రం నిలకడ లేని పవన్‌కు.. సంక్షేమ సారథి అయిన వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. జగన్‌ సునామీతో చంద్రబాబు అడ్రస్‌ గల్లంతయ్యిందని ఎద్దేవా చేశారు. పవన్‌ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కాకాణి అన్నారు.

Next Story