ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం.. ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక
నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
By - Medi Samrat |
నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ట నీటి మట్టం స్థాయి 834 అడుగుల( 254.2 మీటర్లు) కు చేరుకున్నప్పుడుశ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉంది.. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అక్రమంగా, అన్యాయంగా నీటిని తోడేస్తున్నారు.. ఈ అంశంపై ఎన్ని సార్లు విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు.. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం, అదే విధంగా కృష్ణా పరివాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చాం.. మా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని తెలిపారు.
ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ - ప్రజాప్రతినిధులం సిద్ధంగా ఉన్నామన్నారు. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే- రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుంది అని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు. ఏపీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇలాంటి వాటికి ఒడిగడితే తెలంగాణ ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపట్టాం.. హై కోర్టును ఆశ్రయించాం.. అప్పుడు - ఇప్పుడు మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు.