ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై పర్యావరణ ఆందోళనలు లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీ రెండో రోజు టీడీపీ విమర్శలకు సమాధానం ఇస్తూ మండిపడ్డారు. ''తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి గట్టి పోటీ నెలకొనడంతో ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపి, మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లు మంజూరు చేసింది. ఈ పార్క్ రూ. 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది'' అని అమర్‌నాథ్ అన్నారు.
ఇదే అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ.. కడప స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించినట్లు సభకు తెలియజేశారు. 480 ఎకరాలు సేకరించినందుకు గాను ఇప్పటికే రూ.37 కోట్లు పరిహారం కింద విడుదల చేశామని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని టీడీపీ సభ్యులకు సూచించారు.
అంతకుముందు.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం శాసనసభ్యులు అధికార వైసీపీకి ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు అన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై మోదీ ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం మాట్లాడడం లేదని ఆయన మండిపడ్డారు. కాగా, ఇవాళ ఏపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.