పవన్ సినిమాలప్పుడే వివాదాలా?.. మంత్రి దుర్గేష్ ఆన్ ఫైర్
పవన్ సినిమాల రిలీజ్ సమయంలోనే కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు.
By అంజి
పవన్ సినిమాలప్పుడే వివాదాలా?.. మంత్రి దుర్గేష్ ఆన్ ఫైర్
అమరావతి: పవన్ సినిమాల రిలీజ్ సమయంలోనే కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. రిలీజ్ కాకుండానే 'హరిహర వీరమల్లు' ప్లాప్ అని పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చిత్ర పరిశ్రమ ప్రైవేట్ రంగం అయితే గత ప్రభుత్వంలో ఎందుకు నియంత్రించారని ప్రశ్నించారు. కుట్ర కోణంపై విచారణ మాత్రమే చేయమన్నామని, ఎవరినీ అరెస్ట్ చేయమని ఆదేశించలేదని దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తాము ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమని గతంలోనే ఫిల్మ్ ఛాంబర్‌కు తాను లేఖ రాసినట్టు వివరించారు. తమ ప్రభుత్వాన్ని కలవకపోయినా టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచామన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ దుయ్యబట్టారు. పవన్ సినిమాపై ఓ మాజీ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడరని, హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలని హితవు పలికారు. సినిమా రంగాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాత అరవింద్ మాటలు వాస్తవమని పేర్కొన్నారు.