ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే గందరగోళంగా మారాయి. మరోవైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీలో సీఎం జగన్ కూడా టీడీపీ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసి 2024 వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ కొత్త చర్చకు నాంది పలికారు. మంత్రి వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. మరి బొత్స వ్యాఖ్యలు ఎలాంటి రచ్చకు దారితీస్తాయో చూడాలి.
తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడ నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ వేసినా టీడీపీ పట్టించుకోలేదని, అమరావతిలో రాజధాని ఏర్పాటుకు నారాయణ కమిటీని వేసిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే మూడు రాజధాని విషయాలపై మీడియా ప్రశ్నలు వర్షం కురిపిస్తే.. వెయిట్ అండ్ సీ అంటూ బొత్స సత్య నారాయణ అన్నారు.