త్వరలో ఆ భూములమ్మి రైతుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స

Minister botsa comments on ncs sugar factory issue. విజయనగరం జిల్లాలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరగబడటంలో ఎలాంటి తప్పులేదని మంత్రి బొత్స

By అంజి  Published on  5 Nov 2021 3:33 PM IST
త్వరలో ఆ భూములమ్మి రైతుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స

విజయనగరం జిల్లాలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు తిరగబడటంలో ఎలాంటి తప్పులేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని అన్న బొత్స.. షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం గత 6 సంవత్సరాలుగా ఇదే రీతిన వ్యవహరిస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో మంగళవారం నాడు చెరకు రైతులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై మంత్రి బొత్స మాట్లాడారు. 2019లో రైతులకు షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.27 కోట్లు బకాయి పడిందని, అప్పుడు ఆర్‌.ఆర్‌. చట్టం కింద 30 ఎకరాల భూమి అమ్మి రైతుల బకాయిలు తీర్చామని చెప్పారు.

ప్రైవేట్‌ యాజమాన్యంతో అప్రమత్తంగా ఉండాలని ఆనాడే రైతులకు చెప్పానని బొత్స అన్నారు. ఫ్యాక్టరీ నుండి 10 కోట్ల రూపాయల విలువ గల 30 వేల బస్తాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఉన్న రూ.16 కోట్ల రూపాయల బకాయిలు ఎలా తీర్చాలనేదానిపై అధికారులతో చర్చించామని అన్నారు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉన్న 24 ఎకరాల భూమిని ఆర్‌.ఆర్‌ చట్టం కింద త్వరలో అమ్మి రైతుల బకాయిలు చెల్లిస్తామని బొత్స తెలిపారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. రైతులు అధికారంలో లేని పార్టీల మాటలు వినొద్దని, తొందరపడి ఏది పడితే అది మాట్లాడవద్దని అన్నారు.

తమది రైతు ప్రభుత్వమని.. వారికి మేలు జరిగే కార్యక్రమాలే చేపడతామని అన్నారు. పోలీసులపై దాడి చేసినా వాళ్లు సంయమనం పాటించారని, ఇకపై అలాంటి చర్యలు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో 80 వేల టన్నుల చెరకు దిగుబడి ఉందని... ఆ పంటను ఎక్కడ కొనుగోలు చేయాలో ఆలోచిస్తున్నామని మంత్రి బొత్స చెప్పారు. ఇదే సమావేశంలో మంత్రి బొత్స అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై స్పందించారు. అది టీడీపీ రైతు పాదయాత్ర అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. అలాంటప్పుడు పాదయాత్ర ఎందుకని మంత్రి బొత్స ప్రశ్నించారు.

Next Story