ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ కింద ఆగస్టు 2, 3వ తేదీల్లో రైతుల ఖాతాల్లో రూ.7 వేలు (కేంద్రం రూ. 2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు) జమ చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా అన్నవరంలో లోకల్ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు ' కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న మాట్లాడారు.
రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. లిక్కర్ కుంభకోణం.. అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. ఆగస్టు 15వ తేదీన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన వితంతు పెన్షన్లను ఆగస్టు 1 నుంచ పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. మహిళలు రాష్ట్రమంతా ఫ్రీగా ప్రయాణించేలా స్కీమ్ రూపొందించామన్నారు. ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని తెలిపారు.