అమరావతి: వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిశా గోపాల్ పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి..ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, హార్టికల్చర్ పంటల నష్టాన్ని ప్రాథమిక అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర జిల్లాల వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులను, సిబ్బందిని ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.
వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి అచ్చెన్న అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, భారీ వర్షాలు కురవడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యుత్, రెవెన్యూ,పోలీస్,ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.