రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మొహం చాటేశారు : హోం మంత్రి అనిత

ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో పతన స్థాయికి తిరోగమించిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి పతాక స్థాయికి చేర్చే విధంగా 2024 - 25 బడ్జెట్ ఉందని రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

By Medi Samrat  Published on  11 Nov 2024 1:45 PM GMT
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మొహం చాటేశారు : హోం మంత్రి అనిత

ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో పతన స్థాయికి తిరోగమించిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి పతాక స్థాయికి చేర్చే విధంగా 2024 - 25 బడ్జెట్ ఉందని రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత లభించిందన్నారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రతి రంగానికి సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే వెనుకబడిన వర్గాలైప ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం సుమారు 23 శాతం బడ్జెట్ నిధులు కేటాయింపుతో ఆయా వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమేనన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో 40 శాతానికి పూగా వాటా ఉన్న వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.43,402 కోట్లు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న పేరుకు సార్థకత చేకూరిందన్నారు. విద్య, వైద్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, నైపుణ్య రంగంతో పాటు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధితో పాటు రాష్ట్ర రాహదారుల కోసం సింహభాగం ఖర్చు చేయాలని భావించడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు మొహం చాటేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా రాకుండా తమ భాద్యతా రాహిత్యాన్ని బహిర్గతం చేశారన్నారు.

బడ్జెట్ కేటాయింపులతో పోలీస్ శాఖకు పూర్వవైభవం తెస్తాం: హోంమంత్రి అనిత

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు 2024- 25 బడ్జెట్ లో రూ.8,495 కోట్లు కేటాయించారన్నారు. గత ప్రభుత్వ పాలనలో అర కొర సౌకర్యాలతో పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టిందన్నారు. పోలీసు బలగాల ఆధునీకరణ, మౌలిక వసతుల కోసం ఇప్పటికే రూ.62 కోట్లు నిధులు విడుదల అయ్యాయన్నారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టి పీడించిన మాదకద్రవ్యాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. అందుకే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ కేసుల సత్వర పరిష్కారానికి 13 ఫాస్ట్ ట్రాక్ NDPS ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విద్యార్థులను మత్తుకు బానిసలు కాకుండా ఉంచేందుకు ఉన్నత విద్యాసంస్థల్లో 3,172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందితో ఉమెన్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Next Story