రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాక్ భవనంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేగాక రెవెన్యూ శాఖలో జవాబు దారీ తనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి వెల్లడించారు. జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లకై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూ రికార్డుల్లో ఎవరికి వారు నచ్చిన విధంగా మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కోర్టు కేసుల సమర్ధ నిర్వహణకు అన్లైన్ రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.