పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ కల.. దానిని పూర్తి చేసి, ప్రారంభించేది జగనే : మంత్రి అంబటి
Minister Ambati Rambabu said spreading false propaganda on the Polavaram project. పోలవరం పూర్తయితే పేదలకు, రైతులకు..తద్వారా ఈ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని..
By Medi Samrat
పోలవరం పూర్తయితే పేదలకు, రైతులకు..తద్వారా ఈ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. అటువంటి పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు పోలవరంపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను, వాస్తవ పరిస్థితులను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా నాడు వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
గత ప్రభుత్వంలో పోలవరం పనులు 48.39% మాత్రమే జరిగాయని కానీ 78% పూర్తి చేసినట్టుగా చెప్పడం సత్యదూరమన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయహోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. కానీ గత ప్రభుత్వం తామే నిర్మిస్తామని పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకుందని గుర్తు చేశారు. 2016లో ప్రాజెక్టును కేంద్రం నుండి తీసుకుని.. 2013-2014 రేట్ల ప్రకారం కట్టుకుంటామని చెప్పి 2016 రేట్ల ప్రకారం.. నిర్మాణ బాధ్యతలు నవయుగకు కాంట్రాక్టును అప్పగించారన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై కూడా గత ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017-2018 లెక్కల ప్రకారం.. పోలవరం రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ రూ.55, 656 కోట్లుగా నిర్ణయించారని.. అసంపూర్తిగా వదిలేసిన స్పిల్ వే ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించిందన్నారు. ప్రస్తుతం 26 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ఛానల్ ద్వారా మళ్లించామన్నారు. ఈ ఏడాది మార్చిలోనే లోయర్ కాఫర్ డ్యామ్‌ను సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు.
పోలవరం నిర్మాణం రెండు దశల్లో జరుగుతుందని 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ..45.72 మీటర్ల ఎత్తుతో రెండో దశ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. 41.15 మీటర్ల ఎత్తుతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందనేది అసత్యమన్నారు. పోలవరం ఆర్&ఆర్‌కు రూ.30 వేల కోట్లు పైనే ఖర్చు అవుతుందని.. పెరిగిన ధరలు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడంతో నీరు వెళ్లే మార్గం లేక 2020లో వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. డయాఫ్రమ్ వాల్‌ను బాగు చేయాలా? లేక కొత్తది నిర్మించాలా అనేది పీపీఏ, సీడబ్ల్యూసీ తీసుకునే నిర్ణయం మేరకు స్పష్టత వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్సార్ కల అని.. దానిని పూర్తి చేసి ప్రారంభించేది కూడా ఆయన కుమారుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి స్పష్టం చేశారు.