క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల

క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభం.

By Medi Samrat
Published on : 30 April 2025 7:21 PM IST

క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల

క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభం. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025 లో భాగంగా 3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయం లో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.

మెగా డీఎస్సీ లో విడుదల చేసిన 16,347 పోస్ట్ ల్లో క్రీడా కోటా క్రింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద కేటాయించడమైనది మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ కోటా కు ఎంపికను పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నిష్పక్షపాతంగా కేవలం అర్హులందరికీ న్యాయం జరిగిలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. అలాగే ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇన్సెంటీవ్ లు అందిస్తామని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే 2 నుండి మే 31 వరకు https://sports.ap.gov.in, https://sportsdsc.apcfss.in వెబ్‌సైట్లలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

మెగా డీఎస్సీలో క్రీడా కోటా క్రింద ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 333 పోస్టులు, మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో 22 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2 పోస్టులు, ఏపీ మోడల్ పాఠశాలల్లో 4 పోస్టులు, ఏపీ సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7 పోస్టులు, ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 23 పోస్టులు కేటాయించినట్లు వివరించారు. క్రీడలలో ప్రతిభ చూపిన యువతకు ఇది ఒక అపూర్వ అవకాశం. స్థిరమైన జీవితం, గౌరవం, ఉద్యోగ భద్రత లభించేందుకు ఇది మార్గం" అని మంత్రి రాంప్రాసాద్ రెడ్డి తెలిపారు.

Next Story