అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కోవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో... వైద్యం కొరకు ఇతర రాష్ట్రాల నుండి శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వచ్చే రోగులకు తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుండి పుట్టపర్తికి వస్తున్న వారికి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు.. సుదూర ప్రాంతాల వాసులకు వైద్య సేవలు లభించవు అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే పుట్టపర్తి పరిసర వాసులకు వైద్య సేవల నుండి మినహాయింపు ఇచ్చారు. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తో స్థానిక మండల ప్రజలు, సూపర్ హాస్పిటల్‌లో వైద్య సేవలు వినియోగించుకోవచ్చు.
గడిచిన రెండు రోజుల్లో పట్టణంలో 100 కు పైగా కరోనా కేసులు నమోదు అవ్వడం కలవరపెడుతోంది. మరోవైపు పట్టణంలో మాస్కులు లేని వారిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాస్కు ధరించిన వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. అవసరమైతే తప్ప జనావాస ప్రాంతంలో సంచరించరాదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్ నియంత్రణ కొరకు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది.